*కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన రఘురామకృష్ణంరాజు* ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘాన్ని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు కలిశారు. తనకు జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటుపై ఫిర్యాదు చేశారు. పార్టీ లెటర్‌ హెడ్ కాకుండా మరో పేరుతో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సంజాయిషీ కోరితే సాధారణంగా ఎవరైనా సమాధానం ఇస్తారు... కానీ, రఘురామకృష్ణంరాజు దీనికి భిన్నంగా తనకు నోటీసు పంపినవారికే ప్రశ్నలు సంధించారు. అసలు ఏ పార్టీ పేరు మీద సంజాయిషీ కోరుతున్నారు... పార్టీ క్రమశిక్షణ కమిటీ చేయాల్సిన పనిని జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా చేస్తారు.. అసలు ఒక రాష్ట్ర పార్టీకి జాతీయ కార్యదర్శి ఉండటం ఏమిటి.. అంటూ ‘రూల్స్‌’ కర్రను ఝుళిపించారు. నోటీసుపై ఏదో చెబుతారని అంతా ఎదురుచూడగా.. ఆయన మాత్రం ఈ వ్యవహారాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి, చివరకు కేంద్ర ఎన్నికల సంఘానికీ ముడేసి, మొత్తం చర్చనే మలుపు తిప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు రఘురామకృష్ణంరాజును సంజాయిషీ కోరుతూ ఈ నెల 23వ తేదీన విజయసాయిరెడ్డి లేఖ రాశారు.


Comments