శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాలు ప్రారంభం తిరుమల, 21 జూన్ 2020 (కలియుగ నారద) : శ్రీ‌వారి ఆల‌యం త‌లుపులు ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు తీసి శాస్త్రోక్తంగా స్వామివారి కైంక‌ర్యాలు ప్రారంభించారు. సూర్యగ్రహణం కారణంగా శ‌ని‌వారం రాత్రి 8.30 గంట‌లకు ఆల‌య తలుపులు మూసిన విష‌యం విదిత‌మే. ఆదివారం ఉదయం 10.18 గంట‌లకు ప్రారంభ‌మైన సూర్యగ్రహణం మ‌‌ధ్యాహ్నం 1.38 గంట‌లకు ముగిసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో సుప్రభాతం, ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, ఇత‌ర నిత్య కైంక‌ర్యాల‌ను ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం నిర్ణీత సమయం తరువాత భక్తులను అనుమతించకూడదనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో భ‌క్తుల‌ను టీటీడీ దర్శనానికి అనుమతించలేదు. టీటీడీ అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్రనాథ్‌, విఎస్‌వో మ‌నోహ‌ర్‌, శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి పాల శేషాద్రి త‌దితరులు పాల్గొన్నారు. ........................ సోమవారం దర్శనం ......................... జూన్ 22వ తేదీ సోమ‌వారం ఉద‌యం నుండి భ‌క్తుల‌ను వారికి కేటాయించిన స‌మ‌యాల‌ల్లో శ్రీ‌వారి ద‌ర్శనానికి అనుమ‌తించనున్నారు.


Comments