రెండు మూడు రోజుల్లో పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధం* *• ప్రస్తుతం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు* *• కొనుగోళ్ల కోసం భవిష్యత్ లో ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు చర్యలు* *• పొగాకు కొనుగోళ్ల కంపెనీలకు ప్రభుత్వమే పోటీగా నిలుస్తుంది* *• పంట కొనుగోళ్లలో కంపెనీల ఇబ్బందుల నివారణకు చర్యలు* *• వ్యవసాయ సలహామండళ్లకు రైతే ఛైర్మన్* *• రైతు ప్రయోజనాలు, సంక్షేమమే ముఖ్యం: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు* అమరావతి (ప్రజాఅమరావతి),18 జూన్ : రెండు,మూడు రోజుల్లో మార్కెటింగ్ శాఖ ద్వారా పొగాకు కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు సిద్ధమైందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయం నాల్గవ బ్లాక్ లోని ప్రచార విభాగం ముందున్న పచ్చిక ఆవరణలో గురువారం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. పొగాకు రైతుల ఇబ్బందులపై ఈ ఉదయం సీఎం వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తనతో పాటు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ బాలశౌరి, టీటీడీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, పొగాకు బోర్డు ఛైర్మన్‌ రఘునాథబాబు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్, మార్క్‌ ఫెడ్‌ ఎండీ ప్రద్యుమ్న తదితరులు హాజరయ్యారని తెలిపారు. వీరితో పాటు సమావేశానికి వివిధ కంపెనీల ప్రతినిధులు, రైతులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశంలో రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని మంత్రి వివరించారు. ఇకపై పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ లో జోక్యం చేసుకోనుందన్నారు. ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులు ఏపీ మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోళ్లు చేయాలని నిర్ణయించామన్నారు. దీని కోసం ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆ సంస్థ పొగాకు కొనుగోలు కోసం లైసెన్స్‌ తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య కు పరిశీలన బాధ్యతలు అప్పగించారన్నారు. అదేవిధంగా మార్కెటింగ్‌ శాఖ కమిషనర్, మార్క్‌ ఫెడ్‌ ఎండీ ప్రద్యుమ్నకు ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారన్నారు. బోర్డు.. పొగాకు కొనుగోలు కంపెనీలు, వ్యాపారుల సహకారంతో ముందుకు వెళ్తుందని వివరించారు. ప్రకటించిన కనీస ధరల కన్నా.. ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా చూస్తుందని తెలిపారు. పొగాకు గ్రేడ్ల వారీగా రెండు రోజుల్లో కనీస ధరలు ప్రకటించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి తెలిపారు. ఆ రేట్ల జాబితాను కొనుగోలు కేంద్రాల్లో ప్రదర్శిస్తామన్నారు. అంత కన్నా పైధరకే వేలం పాటలు పాడాలన్నారు. అలాగే లైసెన్స్‌ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పొగాకును కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పొగాకు కొనుగోలు ప్రక్రియలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీలపై వేటు వేయాలని నిర్ణయించామన్నారు. లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు, కంపెనీలకు నియమాలు నిర్ధేశించామన్నారు. వేలంలో కంపెనీలు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించామన్నారు. వేలం జరిగే కేంద్రాల వద్ద అన్ని రోజుల్లో కూడా కొనుగోళ్లలో పాల్గొనాలని సూచించామన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు తప్పనిసరిగా కొనుగోళ్లు జరపాలని, లేకపోతే వారి లైసెన్స్‌ లు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఆదాయం తెచ్చుకోవాలనే లక్ష్యంతో కాకుండా, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఇదే తమ అజెండా అని మంత్రి చెప్పారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుందని తద్వారా మార్కెట్ లో కాంపిటీషన్‌ పెంచిందని మంత్రి తెలిపారు. ఇదొక గొప్ప విప్లవమని మంత్రి అన్నారు. తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమన్నారు. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ముందుకు రావాల్సి ఉందని కంపెనీ యాజమాన్యాలతో ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి తెలిపారు. కంపెనీ ఇచ్చిన లక్ష్యాల మేరకే సాగవుతున్నప్పుడు కొనుగోలు చేయకోతే రైతులు నష్టపోతారని సీఎం తెలిపారన్నారు. 920 మందికి లైసెన్స్‌ లు ఇచ్చినా.. 15 మందికి మించి పొగాకు వేలం పాటల్లో పాల్గొనడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కుమ్మక్కు అవుతున్నారని రైతులు అంటున్నారని, భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించామన్నారు. రైతులు వేలం కేంద్రానికి తీసుకువచ్చినప్పుడు కేవలం నాణ్యమైన పొగాకును మాత్రమే తీసుకుని మిగతాది కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని భరోసానిచ్చారు. మార్కెట్లో పారదర్శకత, ఫెయిర్‌ విధానాలు, పోటీని పెంచే విధానాలు ఉండాలన్నారు. రైతుల సరుకును నిరాకరించడం వల్ల వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయని, చివరకు వారు ఎంతో కొంతకు తెగనమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయన్నారు. వేలం కేంద్రానికి సరుకు వచ్చిన రోజే కొనుగోలు చేస్తేనే బాగుంటుందన్నారు. రైతుల నుంచి ఎంత కొనుగోలు చేస్తామన్నది ముందే కంపెనీలు పరిమితి విధిస్తున్నప్పుడు.. కొనుగోలు చేయకపోవడం కరెక్టు కాదని, రైతును తిప్పి పంపే పరిస్థితి ఇకపై ఉండకూడదని కంపెనీ యాజమాన్యాలతో ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి తెలిపారు. కేవలం మేలు రకం కొనుగోలు చేయడం వల్ల రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టినట్టు అవుతుందన్నారు. ప్రాసెస్‌ చేసే అవకాశం రైతుకు లేదు కాబట్టి.. రైతు ఎంతకాలం సరుకును నిల్వ చేసుకోలేడని, చివరకు రింగ్‌ ఏర్పడ్డానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు. సులభతరమైన పద్ధతిలో రైతు ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పించాలన్నారు. ఉత్పత్తుల విషయంలో రైతులను ప్రోత్సహించాలే తప్ప ఒత్తిడి చేయకూడదని మంత్రి సూచించారు. ఈ ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశామన్నారు. అరటి, మొక్కజొన్న, పసుపు, శనగ ఇలా అన్ని రకాల పంటలను కొనుగోలు చేశామని మంత్రి వెల్లడించారు.కరోనా సమయంలో భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేశామన్నారు. పొగాకును కూడా కొనుగోలు చేస్తామని, మార్కెట్‌కు ఏం రకం పొగాకు ఉత్పత్తులు వచ్చినా సరే కొనుగోలు చేయాల్సిందేనన్నారు. అన్ని రకాల పొగాకును కనీస ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలని సూచించారు. ఈ రేట్లను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించామన్నారు. ఈ రేట్లను ప్రామాణికంగా తీసుకుని వేలం నిర్వహించాలన్నారు. ప్రకటించిన కనీస రేట్లకుపైనే వేలం కొనసాగాలని సూచించామన్నారు. తద్వారా రైతుల్లో విశ్వాసం, భరోసా కల్పించాలన్నారు. పొగాకు బోర్డు, కంపెనీలు కలిసి రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.. లైసెన్స్‌ లు తీసుకుని, వేలంలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీల విషయంలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలన్నారు. పొగాకు కొనుగోలు వ్యవహారాన్ని రింగ్‌ చేసే పద్దతులకు స్వస్తి చెప్పాలని, వ్యాపారాలు చేయని వారి లైసెన్స్‌ లను తొలగించాలన్నారు. వ్యాపారాలు చేయకపోతే వారికి లైసెన్స్‌ లు ఎందుకు? అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశ్నించారన్నారు. ఇవి చేయగలిగితే చాలా వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. సమావేశంలో రైతుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారని మంత్రి తెలిపారు. పొగాకు కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులను రైతులు ముఖ్యమంత్రికి వివరించారన్నారు. ఇండెంట్‌ ఇచ్చి, తమ చేత పంట పండించి చివరకు వేలం కేంద్రం వద్దకు రావడం లేదని రైతులు ఆవేదన వెల్లగక్కారన్నారు. కరోనాకు ముందు ధరలు బాగున్నా, ఇప్పుడు కరోనా తర్వాత ధరలు తగ్గిపోయాయని, తమ దగ్గర పొగాకును కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారన్నారు. గడువు ముగిసినా కొనుగోలు చేయడం లేదని, వేలం కేంద్రాల వైపు వ్యాపారులు చూడడం లేదని ముఖ్యమంత్రితో రైతులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. రైతుల సమస్యలు సామర్యస్యంగా విన్న ముఖ్యమంత్రి కంపెనీల యాజమాన్యాలకు పలు సూచనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో వివిధ స్థాయిల్లో ఏర్పాటు కానున్న వ్యవసాయ సలహా మండళ్లలో రైతే ఛైర్మన్ గా ఉంటారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీవోలు మార్పులు చేశామన్నారు. రైతు భాగస్వామ్యంతో ఈ మండళ్లు నడవాలన్నారు. జిల్లా స్థాయిలో ఇన్ ఛార్జి మంత్రిని గౌరవ ఛైర్మన్ గా ఉంచి, అనుభవం కలిగిన రైతును జిల్లాస్థాయి వ్యవసాయ మండలికి ఛైర్మన్ గా నియమించాలన్నారు. మండలస్థాయిలో కూడా గౌరవ ఛైర్మన్ లుగా శాసనసభ్యులుంటారని ఛైర్మన్ గా రైతు ఉండనున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆయా పంటలను బట్టి రైతును తీసుకోనున్నామన్నారు. ఆక్వా ఉన్న దగ్గర ఆక్వా రైతును, కౌలు రైతును, మహిళా రైతును ఇందులో సభ్యులుగా ఉంచుతామన్నారు. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ అడ్వైజరీ బోర్డులు పనిచేస్తాయన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉందన్నారు. ఆర్ బీకే కేంద్రాలు గొప్పగా పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి కితాబిచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆర్బీకే అధికారులు, సిబ్బంది రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం సూచించారన్నారు. అదే క్రమంలో గిరిజనులకు నాణ్యమైన విత్తనాలు 90 శాతం సబ్సిడీతో ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సమావేశంలో తూర్పుగోదావరి డీసీసీబీ ఛైర్మన్ అనంతబాబు పాల్గొన్నారు.


Comments