*వైసీపీ అరాచకాలపై గవర్నర్‌కు చంద్రబాబు 14 పేజీల లేఖ* విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై 14 పేజీల లేఖను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు, వేధింపులు, రాజ్యాంగ వ్యవస్థల విచ్చిన్నంపై ఫిర్యాదు చేశారు. దళితులు, బీసీలపై వైసీపీ దాడులు చేస్తోందని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. వైసీపీ నేతలు వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను అప్రజాస్వామికంగా తొలగించారని, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లను అసభ్య పదజాలంతో దూషించారని గవర్నర్ హరిచందన్‌కు లేఖ ద్వారా చంద్రబాబు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం చెందారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధ సంస్థలు నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం దిగుతోందన్నారు. ఏడాది కాలంలో ఇసుక, భూసేకరణ, మద్యం‌లో అక్రమాలకు పాల్పడ్డారని గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.


Comments