ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు తొలగించడం ప్రజాస్వామ్య విజయం- గద్దె విజయవాడ: ప్రభుత్వ భవనాలకు వైసిపి జెండా రంగులు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయమని, ఇది ప్రజాస్వామ్య విజయంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో అభివర్ణించారు.పార్టీ జెండా రంగులు ప్రభుత్వ భవనాలకు వేయడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని, వైసిపి వికృత చేష్టల్లో ఈ రంగులు వేయడం ఒక భాగమని అన్నారు. పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్స్, దిశ పోలీస్ స్టేషన్లు, రైతు భరోసా కేంద్రాలు, వాటర్ ట్యాంకులు, కరెంటు స్తంభాలు, ఆర్టీసీ బస్సులు, పాయిఖానాలు, కుప్ప తొట్టెలు, చెత్త కుండీలు, స్మశానాలకు కూడా వైసిపి రంగులు వేయడం చూస్తే వీళ్ళ రంగుల పిచ్చి ఎంత పరాకాష్టకు చేరిందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. నాలుగు వారాల్లో రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, మట్టి రంగు జోడించి కోర్టులనే మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని, కానీ సుప్రీం కోర్టు ధర్మాసనం తమ దగ్గర చూపకండి తమ అధిక తెలివి తేటలు అని వ్యాఖ్యానించిందంటే ప్రభుత్వ తప్పుడు విధానాలను అర్థం చేసుకోవచ్చన్నారు. రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, రంగులు మార్చడానికి రూ1300 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ఖర్చంతా వైసీపీ ఇస్తుందా? జగన్ ఇస్తాడా? అని గద్దె ప్రశ్నించారు. కరోనా లాక్ డౌన్ కాలంలో ఈ డబ్బులతో ప్రతి కుటుంబానికి రూ 10,000 ఆర్థిక సహాయం అందించే వీలు ఉంటుందని, ఎంతోమంది కరోనా పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించేందుకు వీలుంటుందని గద్దె తెలిపారు.


Comments